North East Express Derails (PIC@ ANI X)

Patna, OCT 12: బీహార్‌ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. బక్సర్ (Buxar) జిల్లాలోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ (North East Express Derail) పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి వస్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ (North East Express Derail) అసోం రాష్ట్రంలోని గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు వెళుతుండగా బుధవారం రాత్రి 9:53 గంటలకు రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో మరో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ‘‘రైలు నంబర్ 12506 ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్య వరకు రఘునాథ్‌పూర్ స్టేషన్ (Raghunathpur station) ప్రధాన లైన్ గుండా వెళుతోంది. ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారని తూర్పు మధ్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పిన తర్వాత ఢిల్లీ-దిబ్రూగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 18 రైళ్లను దారి మళ్లించారు. కోచ్‌ల పునరుద్ధరణ కోసం వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని, రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని రైల్వే అధికారి తెలిపారు.

 

‘‘రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలో యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారులు, స్థానికులు కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు’’ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwani Vaishnav) చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ, బక్సర్, భోజ్‌పూర్ ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు.

 

వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన వైద్య ఏర్పాట్లు చేయాలని తేజస్వీ ఆదేశించారు. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని అసోం ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, అంబులెన్స్‌లు మరియు వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు: పాట్నా జంక్షన్- 9771449971, దానాపూర్ – 8905697493, అరా- 8306182542, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్- 9794849461, 8081206628. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ప్రయాణికులను వేరే రైలు ఎక్కించేందుకు పాట్నా నుంచి స్క్రాచ్ రేక్ పంపినట్లు రైల్వే అధికారి తెలిపారు.