New Delhi, Feb 28: కరోనా కేసులు తగ్గడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త మాస్కులు తగ్గించి రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే ఐఐటీ కాన్పూర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలో కరోనా ధర్డ్ వేవ్ ముగిసిపోతున్న తరుణంలో ఇది బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం... జూన్‌లో దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ (COVID-19 Fourth Wave) వస్తుందని హెచ్చరించింది. కరోనా కేసుల ఉధృతి నాలుగు నెలలపాటు (Covid-19 fourth wave in June) కొనసాగవచ్చని తెలిపింది. వైరస్ వేరియంట్, టీకా దశల స్థితి వంటి అనేక అంశాలపై నాల్గవ దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.
ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur study) మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్, శలభ్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. జింబాబ్వే కరోనా డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ మిశ్రమ సిద్ధాంతం ప్రకారం ఈ స్టడీని నిర్వహించారు. వైరస్ కొత్త వేరియంట్లు ఎల్లప్పుడూ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్న విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయాన్ని చేపట్టారు. ఆ సమాచారాన్ని మెడ్‌రెక్సివ్‌లో ప్రీ-ప్రింట్‌గా ప్రచురించారు. అయితే దీనిపై ఇంకా ముందస్తు సమీక్ష జరుగలేదు.
దేశంలో 10 వేల దిగువకు పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 8,013 మందికి కరోనా, 119 మంది మృతి
కాగా, తమ పరిశీలన ప్రకారం దేశంలో ప్రాథమిక డేటా అందుబాటులోకి వచ్చిన 936 రోజులకు కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందని అధ్యయనకారులు తెలిపారు. ఈ డేటా ఈ ఏడాది జనవరి 22న వెలుగులోకి వచ్చిందని, దీంతో దేశంలో కరోనా నాలుగో దశ జూన్ 22 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆగస్ట్ 23న పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని, అక్టోబర్ 24న నాలుగో దశ ముగుస్తుందని అంచనా వేశారు. ఆగస్ట్ 15-31 మధ్య కరోనా ఫోర్త్ వేవ్ తీవ్రత గరిష్ఠంగా ఉంటుందని 99 శాతం మేర విశ్వాసం వ్యక్తం చేశారు. నాల్గవ వేవ్‌తో కొత్త వేరియంట్ రావచ్చని అధ్యయనం చెబుతోంది, అయితే, ఇన్‌ఫెక్టిబిలిటీ, మరణాలు వంటి వాటిపై తీవ్రత ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ స్థితిని బట్టి వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమణ స్థాయి కూడా మారవచ్చని తెలిపింది.