Free Bus Rides For Women: నేటి నుంచి మహిళలకు దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళల రక్షణ కోసం బస్సుల్లో మార్షల్స్ సంఖ్య పెంపు, దిల్లీలోని ప్రతీ ఇంటికి తానే పెద్దకొడుకునని చెప్పుకున్న సీఎం కేజ్రీవాల్
DTC bus. (Photo Credits: IANS)

New Delhi, October 29:  దిల్లీలోని మహిళలు నేటి నుంచి ప్రజా రవాణా సంస్థ (Delhi Transport Corporation) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రజారవాణాలో మహిళలకు భద్రత కల్పిస్తూ వారు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. అక్టోబర్ 29, మంగళవారం నుంచి దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సులు మరియు క్లస్టర్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 'గులాబీ రంగు' టికెట్లను జారీ చేస్తారు. అయితే వీటి కోసం మహిళల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఇలా జారీ చేయబడిన మొత్తం పింక్ టికెట్ల సంఖ్య ఆధారంగా, ఆ మొత్తాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెల్లించనుంది.

ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, దిల్లీలోని సోదరీమణులందరికీ ఇది తన కానుక అని చెప్పారు. రక్షాబంధన్ రోజున 'మహిళలకు ఉచ్చిత ప్రయాణం' కల్పిస్తానని చేసిన ప్రకటనను గుర్తుచేసుకున్న ఆయన, ఈరోజు భాయ్ దూజ్ సందర్భంగా అది నెరవేర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. దిల్లీ లోని ప్రతీ ఇంటికి తాను పెద్ద కొడుకును అని చెప్పుకున్న కేజ్రీవాల్, ప్రతీ ఇంట్లోని నా తల్లికి, చెల్లికి మరియు కూతురు ప్రయాణ ఖర్చులు ఇకపై  తన ప్రభుత్వం భరిస్తుందని, వారందరి రక్షణ తమ బాధ్యతగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది మహిళల భద్రత పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా DTC బస్సుల్లో మహిళలకు రక్షణగా ఉండే మార్షల్స్ సంఖ్య 3,400 నుంచి 13,000కు పెంచుతూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా అనారోగ్యంతో ఉన్న మహిళలకు సహాయంగా ఉంటారని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రయాణికులకు రక్షణగా ఉంటారని ఆయన తెలిపారు. దేశంలో ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన ఏకైక రాష్ట్రం దిల్లీ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

ఇక నుంచి కొత్త బస్సుల్లో సిసిటీవీ కెమెరాలు, ప్యానిక్ బటన్ మరియు హైడ్రాలిక్ లిఫ్ట్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు.