Hyderabad, September 23: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు (Fuel Prices) పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం లీటర్ పెట్రోల్ ధరపై 29 పైసలు పెరిగి రూ. 78.26కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధరపై 23 పైసలు పెరిగి రూ.72.75కి చేరింది. ఇక సోమవారం కూడా దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కంటిన్యూ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి, లీటరుకు 73.91 రూపాయల వద్ద రిటైల్ అవుతోంది.
అదేవిధంగా దేశంలోని మిగతా మెట్రో నగరాలైన ముంబై, చెన్నై మరియు కోల్‌కతాలో సెప్టెంబర్ 23న పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం రోజు ముంబైలో లీటర్ పెట్రోల్ పై 28 పైసలు పెరిగి రూ .79.57 కు అమ్ముడవుతోంది. కోల్‌కతా మరియు చెన్నైలలో కూడా పెట్రోల్ ధరలు వరుసగా 28 మరియు 31 పైసలు పెరిగాయి, దీంతో కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.60 రూపాయలు మరియు చెన్నైలో రూ. 76.83 వద్ద అమ్ముడవుతుంది.
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్) మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సవరించిన పెట్రోల్ ధరలను అమలు చేస్తున్నాయి.
యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) ప్రకారం, అమెరికా మరియు చైనాల తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు భారత దేశమే. సౌదీ అరేబియా నుంచి ప్రతీనెలా భారత్ సుమారు 2 లక్షల టన్నుల ఎల్పీజీని కొనుగోలు చేస్తుంది. అయితే ఇటీవల సౌదీ అరేబియాలో చమురు నిక్షేపాలపై దాడి జరగడం కారణంగా ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా చేసే క్రూడ్ ఆయిల్ లో 5 శాతం కొరత ఏర్పడింది. ఇదే ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. మరోవైపు ఆర్థిక మందగమనం మరియు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా ఇంధన ధరలు పెరగటానికి మరోకారణం.