Coronavirus in Germany: లాక్‌డౌన్ దిశగా జర్మనీ, ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు, వ్యాక్సిన్ వేసుకోని వారివల్లనే వైరస్ విజృంభణ
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Berlin November 11: జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ ఇన్ఫెక్షన్ రేటు భారీగా పెరుగుతోంది. బుధవారం దాదాపు 40వేల కరోనా కేసులు నమోదు కాగా, గురువారం 50 వేలు దాటాయి. ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఐసీయూల్లో చేరే కరోనా రోగుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో మిగిలిన సర్జరీలు నిలిచిపోయాయి.

జర్మనీలో గురువారం రికార్డు స్థాయిలో 50,196 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక వారం రోజులుగా జర్మనీలో ఇన్ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి 232.1 కి చేరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయకుంటే జర్మనీలో మరోసారి లాక్‌డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొందంటున్నారు.

జర్మనీలో ఆసుపత్రులు, ఐసీయూల్లోకి చేరే కరోనా రోగుల సంఖ్య అధికంగా ఉంది. వైరస్ బాధితులతో ఐసీయూలు నిండిపోతున్నాయి. దీంతో కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితులు లేవని ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది మొత్తం కరోనా రోగుల చికిత్సలో నిమగ్నమయ్యారు. దీంతో పలు సర్జరీలను పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందని ఆస్పత్రులు తెలిపాయి. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రంగా మారుతుండటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఉధృతిని కట్టడిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత దిగజారుతుందంటున్నారు.

కరోనా తీవ్రత పెరుగుతుండటంతో జర్మనీలో లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అర్హులైనవారంతా వ్యాక్సిన్లు తీసుకోవాలని, ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారివల్లనే కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. జర్మనీలో 67 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు వేసుకున్నారు. ఇప్పటివరకు అక్కడ కరోనా కారణంగా 96 వేల 963 మంది ప్రాణాలు కోల్పోయారు.