Lucknow, JAN 19: ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో (Bhadohi) దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి (Shot Dead) చంపాడు. భదోహికి (Bhadohi) చెందిన అరవింద్ విశ్వకర్మ (Arvind Vishwakarma) అనే 22 ఏళ్ల యువకుడు అనురాధ బింద్ అనే 15 ఏండ్ల బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను అనురాధ (Anuradha) అంగీకరించలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అరవింద్.. తనకుకాకుండా మరొకరికి ఆ అమ్మాయి దక్కొందని అనుకున్నాడో ఏమో.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం తన సోదరితో కలిసి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్తున్న అనురాధను దారిలో అడ్డగించాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో ఆమె తలపై కాల్చాడు. దీంతో ఆమె వెంటనే కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే నిందితుడి అరవింద్ విశ్వకర్మతో అనురాధలు ఒకే ఊరికి చెందినవారని, అతను చాలాకాలంగా ఆమె వెంటపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. తన కళ్లముందే సోదరిని కాల్చి చంపడంతో అనురాధ సోదరి షాక్ కు గురైంది. 15 ఏండ్ల బాలికను ప్రేమపేరుతో వేధించి పొట్టన బెట్టుకున్న అరవింద్ ను తక్షనమే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.