New Delhi, JAN 14: బంగారం (Gold) అంటే భారతీయులకు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు, పెండ్లిండ్లు.. శుభకార్యాలకు బంగారం ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు. వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవాలని భావిస్తారు. కొవిడ్-19 టైంలో ఆల్‌టైం రికార్డు (All time record) నమోదు చేసిన తులం బంగారం ధర(Gold price).. తర్వాత కాసింత తగ్గుముఖం పట్టింది. కానీ, పెండ్లిండ్ల సీజన్.. నూతన సంవత్సరాది.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బంగారం ధర చిక్కనంటూ పైపైకి దూసుకెళ్తున్నది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ. 56,730. మరో మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో రూ.58,450 పలుకుతోంది. కోల్‌కతాలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్లు) రూ.57,450 వద్దకు దూసుకెళ్లింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో పరిణామాలు.. ద్రవ్యోల్బణంతో గ్లోబల్ ధరల్లో మార్పులు, కేంద్రీయ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీరేట్లలో మార్పులూ చేర్పులూ.. బంగారం ధర పెరుగుదలకు దారి తీసినట్లు కనిపిస్తున్నది.
ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారం 24 క్యారట్ల తులం బంగారం ధర గత 13 రోజుల్లో రూ.1,595, జ్యువెల్లరీ గోల్డ్ రూ.1,461 పెరిగింది. తులం బంగారం (24 క్యారట్లు) రూ.56,462కి పెరిగింది. ఇంతకుముందు ఈ నెల తొమ్మిదో తేదీన రూ.56,259 వద్ద నిలిచింది. గత నెల 30న తులం బంగారం ధర రూ.54,867కి చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2022 డిసెంబర్ 30న 1900 డాలర్ల వద్ద నిలిచింది. 2022లో బంగారం, వెండి ధరలు తళుక్కుమన్నాయి.
గతేడాది మొత్తంలో తులం బంగారం ధర రూ.48,279 నుంచి రూ.54,867కి పెరిగింది. అంటే గతేడాది తులం బంగారం ధర రూ.6,588 పెరిగిందన్న మాట. మరోవైపు కిలో వెండి కూడా రూ.6,057 పెరిగి రూ.62,035 నుంచి రూ.68,092కి చేరుకున్నది. శనివారం బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,700లకు, కోల్‌కతాలో రూ.69,200 వద్ద స్థిర పడింది. ఇక ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితి, ఆర్బీఐ తరహాలో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడంతో ఈ ఏడాది తులం బంగారం ధర రూ.64 వేలు పలుకుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా మాట్లాడుతూ కేంద్రీయ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచడం పాజిటివ్ అంశం అని పేర్కొన్నారు.