New Delhi, SEP 19: యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు (US Fed) తగ్గించడం, పెండ్లిండ్లతోపాటు ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు (Gold Price) తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి (Silver price) ధర రూ.500 పుంజుకుని రూ.91 వేలు పలికింది. బుధవారం తులం బంగారం (24 క్యారట్స్-99.9 స్వచ్ఛత) ధర రూ.75,500 పలికితే, కిలో వెండి ధర రూ.90,500 వద్ద ముగిసింది. గత ఆరు సెషన్లలో కిలో వెండి ధర రూ.7,200 వృద్ధి చెందింది. గురువారం 99.5 స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.75,300 పలికింది. ఫ్యూచర్స్ మార్కెట్లో సైతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లాయి. ఎంసీఎక్స్ గోల్డ్ కాంట్రాక్ట్స్ అక్టోబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.498 వృద్ధితో రూ.73,553 వద్ద ముగిస్తే, కిలో వెండి-డిసెంబర్ డెలివరీ ధర రూ.2,105 పుంజుకుని రూ.90,404లకు చేరుకున్నది.
Amazon: వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు హుకుం జారీ చేసిన అమెజాన్
కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి.. అంటే 2020 తర్వాత యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో మందగమనం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ద్రవ్యోల్బణం దిగి వస్తుందని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 0.45 శాతం వృద్ధితో 2610.20 డాలర్లతో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. గురువారం ప్రారంభంలో నష్టపోయిన బంగారం ధరలు యూఎస్ డాలర్లు, ట్రెజరీ బాండ్ల ధరల ప్రభావంతో తర్వాత పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 2.58 శాతం పెరిగి 31.48 డాలర్లు పలికింది. మున్ముందు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రూ.2530 నుంచి 2630 డాలర్లు, ఔన్స్ వెండి ధర 30-32 డాలర్ల మధ్య పలుకుతుందని కోటక్ సెక్యూరిటీస్ ఇంటరెస్ట్ రేట్స్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ అంచనా వేశారు.