Nahan, AUG 10: . భారీ వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సుమారు 128 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Shut). రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆగస్టు 16 వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మండి, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదలకు పంట పొలాలు, పలు నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. కాగా, జూన్ 27 నుంచి ఆగస్టు 9 మధ్య కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా మరణించారు. అదేవిధంగా రూ.842 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.