New Delhi, AUG 11: హిండెన్‌బర్గ్ తాజా నివేదిక (Hindenburg Research) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే (Supriya) అన్నారు. ఈ కుంభకోణంలో అదానీ ప్రమేయం ఉన్నందునే అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపడం లేదా అని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నుంచి పలుమార్లు ఆదేశాలు జారీ అయినప్పటికీ సెబీ (SEBI) చురుకుగా దర్యాప్తు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇది పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నదని, నేరపూరిత కుట్ర కాక ఇది మరేమిటని ఆమె నిలదీశారు. మరోవైపు అదానీ గ్రూప్‌పై ఏడాదిన్నర కిందట సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు (Hindenburg Research) కలకలం రేపుతున్నాయి. అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయని లేటెస్ట్ రిపోర్ట్‌లో పేర్కొనడం దుమారం రేపుతోంది.
కాగా హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భగ్గుమన్నారు. గ్వాలియర్‌లో కేంద్ర మంత్రి ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, దేశంలో అరాచకం వ్యాప్తి చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వివాదాస్పద వ్యవహారాల్లో దేశం నలిగిపోవాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటుందని మండిపడ్డారు.