Telugu Popularity in US: అమెరికాలో తెలుగు వారి హవా! యూఎస్ వెళ్లిన భారతీయుల్లో ఎక్కువ శాతం తెలుగు మాట్లాడేవారే, 79.5 శాతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య
Telugu Popularity in US| Image Used for Representational Purpose | (File Photo)

Washington DC, October 31:  అమెరికా (US) వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. తిన్నవా కాకా..? భోంచేశావా బాబాయ్..? అని పలకరిస్తే చాలు, అక్కడంతా మనోళ్లే.  యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా మరియు తెలంగా మార్చేస్తున్నారు ఇక్కడి తెలుగు వారు. గత ఎనిమిదేళ్లలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి (Telugu Speakers) సంఖ్య భారీగా పెరిగింది. యూఎస్‌లో పాపులర్ భారతీయ భాషగా హిందీ (Hindi) భాష ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుండగా ఆ తర్వాత గుజరాతీ, తెలుగు భాషలు నిలిచాయి. వీటి తర్వాత బెంగాలీ, తమిళం భాషలు ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ నుంచి అమెరికా వెళ్లిన వారు పెరగడంతో బెంగాలీ భాష మాట్లాడేవారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. వీరంతా హిందీ భాష కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగా హిందీ మొదటి స్థానంలో కొనసాగుతుంది.

యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ACS) 2018 డేటా ప్రకారం, అమెరికాలో 5 ఏళ్లకు పైబడి వయసున్న 6.73 కోట్ల మంది నివాసితులు తమ ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాషను మాట్లాడుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం, జూలై 1, 2018 నాటికి 8.74 లక్షల మంది తమ ఇంట్లో హిందీ భాషను మాట్లాడుతున్నట్లు సర్వే పేర్కొంది. 2010 నుంచి 2018 వరకు అమెరికాలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 43.5 శాతం పెరిగింది. ఆశ్చర్యకరంగా ఈ ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 79.5 శాతం పెరిగింది. అయితే 2017 -18 మధ్య కొంత తగ్గుదల కనిపించినట్లుగా రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

మొత్తంగా 2018, జూలై 1 నాటికి యూఎస్ లో గుజరాతీ భాష మాట్లాడేవారి సంఖ్య 4.19 లక్షలు, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4 లక్షలు, బెంగాలీ మాట్లాడేవారి సంఖ్య 3.75 లక్షలు, తమిళం మాట్లాడేవారి సంఖ్య 3.09 లక్షలుగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే బెంగాలీ మాట్లాడేవారిలో బంగ్లాదేశ్ దేశస్థులు కలుస్తారు, శ్రీలంక, మలేషియా దేశాల నుంచి వచ్చిన వారు కూడా తమిళం మాట్లాడుతారు. ఇక తెలుగు మాట్లాడేవారు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు గుర్తించారు. అందులో కూడా ఐటీ ఉద్యోగులే అధికం అని సర్వే పేర్కొంది.