Rahul Gandhi at Red Fort (PIC@ INC Twitter)

New Delhi, DEC 24: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. పలువురు ప్రముఖులు యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మద్దతు తెలిపారు. సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఎర్రకోట వద్ద జరిగిన సభలో రాహుల్‌తో కలిసి కమల్ (Kamal Hassan) పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద జరిగిన సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కారణంగా బీజేపీ (BJP) భయపడి కోవిడ్‌ను సాకుగా చూపుతోందని విమర్శించారు. ఎక్కడా కోవిడ్ లేదు. ఎవరికీ ఏమీ జరగలేదు. ప్రధాని మోదీనే స్వయంగా మాస్క్ ధరించరు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా ఈ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు ఇందంతా చేస్తున్నారు అంటూ కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు.

రాహుల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కొనసాగడం లేదని, అంబాని, అదానీ కనుసన్నల్లో పాలన సాగుతుందని రాహుల్ ఆరోపించారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, ఆ విషయాన్ని ఎన్నోరోజులు దాచలేరని అన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు హిందూ, ముస్లింల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. వందల కిలోమీటర్లు నడిచానని, దేశంలో ఎక్కడా హింస, ద్వేషం చూడలేదని, కానీ నిత్యం టీవీల్లో మాత్రం అది కనిపిస్తుందని రాహుల్ అన్నారు.

నా ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), బీజేపీ నేతలు వేలకోట్ల రూపాయలు వెచ్చించారని, వాళ్లకి ఎంత పవర్ ఉందో చూడాలని నేను ఒక్క మాటకూడా అనలేదని అన్నారు. చైనా విషయం గురించి రాహుల్ ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ టార్గెట్ గా విమర్శలు చేశారు. సరిహద్దుల్లోకి ఎవరూ రాలేదని మోదీ చెబుతున్నారని, అలాంటప్పుడు ఇరు దేశాల సైన్యాలు 21సార్లు ఎందుకు చర్చలు జరిపినట్లు అని రాహుల్ ప్రశ్నించారు. నేడు డిగ్రీలు చదివినవారు సరియైన ఉద్యోగ అవకాశాలు లేక పకోడాలు అమ్ముతున్నారని రాహుల్ అన్నారు.

మేక్ ఇన్ చైనా అని మీ సెల్ ఫోన్లు, మీ షూల వెనుక రాసి కనిపిస్తుందని, మేడ్ ఇన్ ఇండియా అని రావాలని రాహుల్ అన్నారు. చైనా రాజధాని షాంఘైలో షూ చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని కనిపించే రోజు రావాలని, అప్పుడే యువతకు ఉపాధి దొరుకుతుందని రాహుల్ అన్నారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.