దేశంలోని అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులపై పెను భారాన్ని (Hindustan Unilever hikes prices) మోపింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు (soaps and detergents by 3-20%) పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచింది. ఈసారి అత్యధికంగా సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర పెరిగింది. దీని ధరను 20 శాతం పెంచడంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది.
ఇక లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు పెరిగింది. అలాగే పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు పెరిగింది. దీంతో పాటుగా రిన్ బండిల్ ప్యాక్(నాలుగు 250 గ్రాముల బార్ల) ధరను రూ.72 నుంచి రూ.76కు పెంచింది. అలాగే, సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ను రూ.18 నుంచి రూ.19కు పెంచింది. ఇక వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధరను రూ.30 నుంచి రూ.31కి, 1 కిలో ప్యాక్ ధరలను రూ.60 నుంచి రూ.62కు పెంచినట్లు కంపెనీ (Hindustan Unilever) ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక లక్స్ సబ్బుల ధరలను కంపెనీ పెంచలేదు. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతో జనవరిలో తన ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచనున్నట్లు అదానీ విల్మార్ గత నెలలో పేర్కొన్న సంగతి విదితమే, ఇక మరో కంపెనీ పార్లే తమ ప్రొడక్ట్స్ మార్చి నెలలో 4-5 శాతం ధరలను మరోమారు పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ధరలను పెంచింది. ఈ ఏడాది క్యూ4లో ధరలను పెంచవచ్చని డాబర్ ఇండియా డిసెంబర్ నెలలో తెలిపింది. కావింకేర్ తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను కూడా ఈ నెలలో 2-3 శాతం వరకు పెంచనుంది.