Dholpur, May 2: రాజస్దాన్‌లోని దోల్పూర్ జిల్లాలో దారుణం (Rajasthan Shocker) చోటుచేసుకుంది. దెయ్యాలు, భూతాల పేరుతో నయం చేస్తానని ఓ దొంగ బాబా మహిళపై అత్యాచారానికి (Tantric rapes woman) పాల్పడ్డాడు. అనారోగ్యం నయం చేస్తానని నమ్మబలికిన నకిలీ బాబా మహిళ(35)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరాన్ని వీడియో తీసిన నిందితుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని మహిళను బెదిరించాడు.
బాబాపై కుమారుడితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం తగ్గిస్తానని గత రెండేండ్ల నుంచి ప్రతి గురువారం మహిళను రప్పించేవాడు. ఏప్రిల్ 21న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను బెదిరించిన నిందితుడు రూ 50,000 తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక మరో ఘటనలో దెయ్యాలు, భూతాల పేరుతో ఓ దొంగ బాబా.. 19ఏళ్లుగా మహిళపై లైంగిక దాడులకు (Tantric rapes) పాల్పడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కరన్పుర్లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు.
అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు. కానీ, ఆమెతో మాత్రం సంబంధం కొనసాగించాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్ గుజ్రాల్ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది.
బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఆమె ఆరోపణలపై గుజ్రాల్ స్పందిస్తూ.. మహిళ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితురాలి ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదిలా ఉండగా గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు