Credit @ Twitter

New Delhi, OCT 19: హై-ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్ల (Brands) కంపెనీలు తమ ఉత్పత్తులను సరికొత్తగా కస్టమర్ల ముందుకు తీసుకొస్తాయనే అంచనాలుంటాయి. ఆదరణ కలిగివుండే బడాబడా కంపెనీలు తమ బ్రాండ్ వ్యాల్యూను (BRand Value) మరింత పెంచుకోవడమే లక్ష్యంగా వినూత్న ఉత్పత్తులతో మార్కెట్లోకి వస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటుంటాయి. కానీ జర్మనీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘హ్యూగో బాస్’ (Hugo Boss) మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘స్లిప్పర్స్’ మోడల్, వాటి రేటుపై (Slippers) నెటిజన్లు పంచ్‌లు పేలుస్తున్నారు. ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై బ్లూ ఫ్లిప్-ఫ్లాప్ స్లిప్పర్స్ రేటు రూ.8,990 ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. అది కూడా 54 శాతం డిస్కౌంట్‌ పోనూ ఈ భారీ రేటు చూపిస్తోంది.

అయితే ఈ స్లిప్పర్స్ ఏ ప్లాట్‌ఫామ్‌పై ఈ భారీ రేటు పలుకుతున్నాయనేది తెలియరాలేదు. కానీ  దేశీ చెప్పల్స్ లేదా బాత్‌రూమ్ స్లిప్పర్స్‌గా పేర్కొంటూ జోకులు పేల్చుతున్నారు.  ఈ చెప్పులకు రూ.150 కంటే ఎక్కువ పెట్టాలేమని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. రూ.100 మాత్రమే రేటు ఉండే పారాగాన్ (Paragon) చెప్పులు వీటికంటే చాలా బావుంటాయని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నాడు. ‘‘ ఇవి బాత్‌రూమ్ స్లిప్పర్స్ ఫ్రెండ్స్’’ అని ఓ యూజర్, ‘‘ బాత్‌రూమ్ చెప్పల్స్ రోజులు నడుస్తున్నాయ్’’ అని మరో నెటిజన్ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘వారాంతపు సంతలో ఈ చెప్పులను రూ.50కే కొనొచ్చు’’ అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు.

కాగా గతంలో కూడా ఇలాగే పలు బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను భారీగా పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ఫ్యాషన్ బ్రాండ్ ‘బాలెన్సియాగా’ (Balenciaga) మార్కెట్‌లోకి తీసుకొచ్చిన చెత్త బ్యాగు రేటు 1800 డాలర్లుగా పేర్కొంది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.1,42,652గా ఉంది. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే.