Volkswagen Case:   ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్ట్ సమన్లు, వచ్చే నెల న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశం. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలోని కేసు మళ్ళీ తెరపైకి.
AP Minister Botsa Satyanarayana. File Photo.

Hyderabad, August 23: 2005 నాటి 'ఫోక్స్ వేగన్' కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో బొత్స సత్యనారాయణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. నాడు నమోదైన ఫోక్స్ వేగన్ కేసు వ్యవహారంలో మంత్రి బొత్స సాక్షుల జాబితాలో ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కేసుకు విచారణకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సాక్షిగా వ్యవహరించిన మంత్రి బొత్సనారాయణ సెప్టెంబర్ 12న న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ కోర్ట్ ఆయనకు సమన్లు జారీ చేసింది.

ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే,  వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్ వేగన్, విశాఖపట్నంలో దాదాపు రూ. 5వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఫోక్స్ వేగన్ సంస్థకు మధ్యవర్తిగా వ్యవహరించిన 'వశిష్ట వాహన్' అనే కంపెనీకి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 12 కోట్లు చెల్లించింది. అయితే ఈ వశిష్ట వాహన్ వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో ఫోక్స్ వేగన్ కంపనీ ప్రకటించింది. దీంతో మధ్యవర్తి పేరుతో నకిలీ కంపెనీని సృష్టించి  ప్రభుత్వ డబ్బును డైవర్ట్ చేశారు, ఫోక్స్ వేగన్ కంపెనీని హైదరాబాదు నుంచి వైజాగ్ కు తరలించడంలో భారీగా ముడుపులు తీసుకున్నారు అని ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐకు అప్పజెప్పారు. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ 7 గురిని నిందితులుగా, 59 మందిని సాక్షులుగా చేరుస్తూ 3వేల పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. అప్పుడు బొత్స సత్యనారాయణకు సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది.

మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ కోర్టులో హాజరు కావాలంటూ సీబీఐ కోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అని ఆసక్తి నెలకొంది.