Rafale Induction: భారత వాయుసేనలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు, రెండు వైపులా నీటి ధారలతో అపూర్వ స్వాగతం, ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న గగనతల విన్యాసాలు, అద్భుతమనిపించే ఆ దృశ్యాలు మీకోసం
Rafale fighter jets inducted | (Photo Credits: ANI)

New Delhi, September 10:  భారత వాయుసేనలో అధునాతనమైన రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. దీంతో మన వాయుసేన మరింత బలోపేతమైంది. ఒక వైపు భారత్- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల ప్రారంభోత్సవ వేడుక నిర్వహించి చైనాకు తన సందేశమేంటో చెప్పకనే చెప్పింది.

జూలై 29న ఫ్రాన్స్ నుండి భారతదేశానికి చేరుకున్న ఐదు రాఫెల్ ఫైటర్ జెట్లను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్) చేర్చుకున్నారు. దీని ప్రారంభోత్సవ వేడుకలు హరియాణ రాష్ట్రంలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో బుధవారం జరిగింది. ఈ స్థావరాన్ని IAF యొక్క 17 స్క్వాడ్రన్ అని అలాగే ‘గోల్డెన్ బాణాలు’ అని కూడా పిలుస్తారు. భారతదేశం యొక్క మొదటి ఐదు రాఫెల్ యోధులు ‘గోల్డెన్ బాణాలు’ స్క్వాడ్రన్‌లో భాగం అయ్యాయి.

రాఫెల్ యుద్ధ విమానాలకు ఘనమైన స్వాగతం లభించింది. రెండు వైపులా నీటి ధారలను చిమ్ముతూ ఒక తోరణంలా ఏర్పాటు చేయగా అందులో నుంచి ఠీవీగా రాఫెల్ ఫైటర్ జెట్స్ ప్రవేశం తీసుకున్నాయి.

Water Cannon Salute

ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా సర్వమత ప్రార్థనలు (Sarva Dharma Puja) నిర్వహించారు. అనంతరం రాఫెల్, సు -30 మరియు జాగ్వార్లచే నిర్వహించిన అద్భుతమైన గగనతల విన్యాసాలు చూపరులను రోమాలు నిక్కబొడిచేలా చేశాయి.

Induction of Rafale

Sarang Aerobatic Team Performs

ఈ వేడుకలకు ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఐఎఎఫ్ చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు.

సెప్టెంబర్ 2016లో, ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసుకునేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. రూ. 60,000 కోట్ల వ్యయంతో కూడిన ఈ ఒప్పందం భారత్ రక్షణ శాఖకు సంబంధించి చరిత్రలోనే అతిపెద్ద డీల్. ఈ ఒప్పందంలో మాజీ రక్షణశాఖ మంత్రి, దివంగత నేత మనోహర్ పారికర్ కీలకంగా వ్యవహరించారు.