New Delhi, AUG 23: చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం కావడంతో దేశ ప్రజలు భావోద్వేగంతో చప్పట్లు కొట్టారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ (India) అవతరించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. దీనిపై ప్రధాని మోదీ, ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (S Somanath) సగర్వంగా ప్రకటనలు చేశారు. చరిత్ర మరవలేని ఈ రోజు గురించి వారేమన్నారో చూద్దాం.. చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని తన జీవితం ధన్యమైందని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి ఆయన మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురుచూశారని అన్నారు. భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పారు. జోహెన్నస్ బర్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) వెంటనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Johannesburg, South Africa | Immediately after the success of Chandrayaan-3, PM Narendra Modi telephoned ISRO chief S Somanath and congratulated him. pic.twitter.com/NZWCuxdiXw
— ANI (@ANI) August 23, 2023
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ… తమ టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ విజయాల పరంపరను కొనసాగించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇస్రో మాజీ ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ… చాలా సంబరపడుతున్నానని చెప్పారు. ఈ క్షణాల కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ పి వీరముత్తువేల్ మాట్లాడుతూ… దక్షిణ ధ్రువానికి వెళ్లిన తొలి ప్రాజెక్టు మనదేనని సగర్వంగా ప్రకటించారు.