Amritsar, March 29: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. గత కొద్దిరోజులుగా అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) జల్లెడ పడుతున్నారు. అయినా, మారు వేషాల్లో నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. అమృత్‌పాల్ సింగ్ దేశం సరిహద్దులు (Country boundaries) దాటి నేపాల్ (Nepal) వెళ్లి ఉంటాడనే అనుమానాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence agencies) వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత రాయబార కార్యాలయం (India Embassy) విజ్ఞప్తి మేరకు అమృత్‌పాల్ సింగ్ కోసం నేపాల్ పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.
అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా మారువేషంలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకు అక్కడి సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి. అందులో అమృత్ పాల్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తలపాగా లేకుండా కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించాడు. డెనిమ్ జాకెట్ ధరించాడు. అతని సహచరుడు పాపల్ ప్రీత్ సింగ్ కూడా సీసీ టీవీ క్లిప్‌లో కనిపించాడు. తమ గుర్తింపును దాచుకునేందుకు ఇద్దరూ మాస్క్‌లు ధరించారు. ఢిల్లీలోని సీసీ టీవీ వీడియో మార్చి 21 నాటిది. పంజాబ్ పోలీసులు మార్చి 18న పంజాబ్‌లో అమృత్‌పాల్ సింగ్, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ సభ్యులపై చర్యలు ప్రారంభించారు. అయితే, 21న ఢిల్లీ వీధుల్లో సీసీ పుటేజీల్లో కనిపించిన వ్యక్తి అమృత్‌పాల్ అని ఢిల్లీ స్పెషల్ సెల్ వర్గాలు ధృవీకరించాయి.
అమృత్‌పాల్ సింగ్ ఆచూకీకోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. నిందితుడు భారత సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లాడని పోలీసు వర్గాలు భావించాయి. తాజాగా, అమృత్ పాల్ తిరిగి పంజాబ్ వచ్చాడని పంజాబ్ పోలీసులు పేర్కొంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమృత్ పాల్ ఉన్న ఇన్నోవా కారు మార్నియన్ కలాన్ సమీపంలోని ఫగ్వారా – హుషియర్‌పూర్ హైవే సమీపంలో పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతమంతా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని పొలాల్లో, గ్రామాల్లోనూ పంజాబ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత.. అమృత్‌పాల్ ఉన్నట్లు భావిస్తున్న కారును పంజాబ్ పోలీసలుు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. నిందితుడు కారు వదిలి పరిసర గ్రామాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది.
హుషియర్‌పూర్‌లో (Hoshiarpur) అమృత్‌పాల్ ఉన్నాడని విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పంజాబ్ పోలీసులు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అయితే, అమృత్ పాల్ పంజాబ్ మళ్లీ ఎందుకు తిరిగి వచ్చాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ పటిష్ఠ పోలీసు భద్రత మధ్య దేశం విడిచి వెళ్లిపోయేందుకు అవకాశం లేక తిరిగి పంజాబ్ వచ్చాడా? లేకుంటే పోలీసులకు లొంగిపోయేందుకు పంజాబ్ వచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.