Target South India: దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు పన్నాగం, ఆర్మీ హెచ్చరిక. ఎల్‌ఇటి ఉగ్రవాదులు తమిళనాడులోకి చొరబడినట్లు సమాచారం. తీర ప్రాంతాల వెంబడి గస్తీ పెంపు.
Lt Gen SK Saini (Photo Credits: ANI)

Pune, September 10: కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా దౌత్య పరంగా, న్యాయ పరంగా భారత్‌ను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన పాకిస్థాన్ ఇక తనకు తెలిసిన వక్రమార్గాన్ని ఎంచుకుంది. పుల్వామా తరహా దాడులు రిపీట్ అవుతాయి అంటూ

గత కొంత కాలంగా పాకిస్థాన్ రెచ్చగొట్టే హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఈసారి దక్షిణ భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు పన్నింది. నిషేధిత లష్కర్-ఎ-తైబా (Lashkar-e-Taiba) సంస్థకు చెందిన ఉగ్రవాదులు తమిళనాడులో చొరబడినట్లు ఆర్మీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో భద్రత కట్టుదిట్టం చేశారు.

జనరల్-ఆఫీసర్-కమాండింగ్-ఇన్-చీఫ్, సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ సతీందర్ కుమార్ సైనీ మాట్లాడుతూ, “భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉగ్రవాద దాడి జరగవచ్చని మాకు సమాచారం ఉంది. గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ ప్రాంతం నుండి వదిలివేసి వెళ్లిన కొన్ని పడవలను ఇదివరకే స్వాధీనం స్వాధీనం చేసుకున్నాం. ఉగ్రవాద చర్యలను ఎక్కడిక్కడ నిలిపివేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము". అని ఆయన పేర్కొన్నారు.

సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడవచ్చు అని నిఘావర్గాల నుంచి సమాచారం అందిన వెంటనే దేశంలోని అన్ని తీరప్రాంతాల వెంబడి భద్రతను పెంచారు. రెండు రోజుల క్రితం (LeT) ఆపరేటర్‌ను కేరళలో పట్టుకున్నారు.

గత మే నెలలో జైష్-ఇ-మొహమ్మద్ (Jaish-e-Mohammed) అధిపతి అయిన మసూర్ అజార్ (Masood Azhar)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో అతడ్ని ఇంతకాలం జైలులో ఉంచిన పాకిస్థాన్, రహస్యంగా విడుదల చేసినట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితమే, గుజరాత్‌లోని భారత వైమానిక దళాలకు సంబంధించిన వైమానిక స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి. గత నెలలో, భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మొహమ్మద్, భారతదేశంలో విధ్వంసాలను సృష్టించేందుకు కొంతమందిని నియమించి సముద్ర గర్భంలోపలే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి భారత నావికాదళం పూర్తిగా సిద్ధంగా ఉందని అడ్మిరల్ సింగ్ హామీ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం పొడవున కీలక ప్రదేశాలలో భద్రత పెంచామని ఏపి అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు.