Representational Image (Photo Credits: PTI)

Ahmedabad, August 29: సముద్రం లోపలి నుంచే దాడులు జరిపేలా ప్రత్యేక శిక్షణ పొందిన పాకిస్థాన్ కమాండోలు, గుజరాత్ తీరంలోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ సమాచారం అందించింది. హారామి నాలా క్రీక్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ తీర ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అదాని పోర్ట్స్ హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రోజుల క్రితమే సముద్ర మార్గాల గుండా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని భారత వాయుసేన హెచ్చరించింది.

అదానీ గ్రూప్ అధ్వర్యంలో నడుస్తున్న ముండ్రా పోర్ట్ భారతదేశంలోనే అతిపెద్ద పోర్టులలో ఒకటి, మరొకటి రాష్ట్ర అధ్వర్యంలో నడిచే కుండ్ల పోర్ట్. ఈ పోర్ట్ ద్వారా భారీ ఎగుమతి,దిగుమతులు జరుగుతాయి. ఈ రెండు పోర్టులు పాకిస్థాన్ భూభాగానికి అతి సమీపంలో ఉంటాయి. కాబట్టి ఈ రెండు పోర్టుల నుంచి భారత భూభాగంలో అడుగుపెట్టి గుజరాత్ సహా మిగతా ప్రధాన నగరాలలో విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు చేసినట్లు సమాచారం అందింది. దీంతో  ఈ రెండు పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గుజరాత్ తీరం వెంబడి భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

ఐదు రోజుల కిందట ఆగష్టు 24న కూడా హరామి నాలాలో పాకిస్థాన్ కు చెందిన రెండు సింగిల్ ఇంజిన్ బోట్లు  వదిలివేయబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.  అనంతరం ఆ ప్రాంతాన్నంతా   బీఎసెఫ్  బలగాలు జల్లెడ పట్టాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని భద్రతా సిబ్బంది తెలియజేశారు.  ఈ హరామి నాలా, సర్ క్రీక్ ప్రాంతంలోని అత్యంత ఇరుకుగా పాకిస్థాన్ , భారత్ బార్డను వేరుచేస్తూ ఉంటుంది. ఈ మార్గం గుండా ప్రవేశించిన పాకిస్థాన్ మత్స్యకారులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న బోట్లు, తదితర కేసులను బీఎస్ఎఫ్ విచారిస్తుంది.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్ అనేక విధాలుగా  ప్రయత్నిస్తుంది. భారత్‌ను దౌత్య పరంగా ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్, ఇక ఉగ్రవాద దాడులతో దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంది.