Railway Reservation: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, వారం పాటూ ప్రతిరోజు ఆరు గంటల పాటూ రిజర్వేషన్ సర్వీసులు నిలిపివేత, డేటా అప్‌డేట్ చేస్తున్న రైల్వేశాఖ

New Delhi November 14:  రైల్వే టికెట్ల రిజర్వేషన్‌ సౌకర్యంపై కీలక  ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆరు రోజుల పాటూ అర్ధరాత్రి సమయాల్లో రైలు టికెట్ల రిజర్వేషన్ అందుబాటులో ఉండదని తెలిపింది. 14వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం నిలిపివేయనున్నారు. ఇదే తరహాలో 20వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్‌ సేవలు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

మొత్తం ఆరు రోజుల పాటు ప్రతి రోజు ఆరు గంటల పాటు ఈ అసౌకర్యం ఏర్పడుతుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఆరు రోజుల పాటు రిజర్వేషన్లకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ప్రత్యేక రైళ్ల నంబర్లకు బదులుగా సాధారణ రైళ్ల నంబర్లతో రైళ్లు నడపనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ కోసం ఆయా గంటల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లూ ప్రత్యేక రైళ్లు నడిపిన రైల్వే శాఖ ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో సాధారణ రైలు సర్వీసులను పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజర్వ్‌డ్‌ రైళ్ల నంబర్లను అప్‌లోడ్‌ చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని మెయిల్‌, ఎక్స్ ప్రెస్‌, పాత రైళ్ల నంబర్లను, ప్రస్తుత ప్యాసింజర్‌ బుకింగ్‌ డేటాతో పాటు అప్‌ డేట్‌ చేయాల్సి ఉంటుంది. టికెటింగ్‌ సర్వీసులపై ప్రభావం పడకుండా రాత్రి సమయంలో రైల్వే శాఖ ఈ ప్రక్రియ చేపట్టనుంది.

ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో రిజర్వేషన్‌, కరెంట్‌ బుకింగ్‌, టికెట్‌ క్యాన్సిలేషన్‌ వంటి సేవలు అందుబాటులో ఉండవు. రిజర్వేషన్ సేవలు మినహా 139 టెలిఫోన్‌ సేవలు సహా మిగతా అన్ని విచారణ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. మార్పు చేసిన రైళ్ల నంబర్లను ఇప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఎస్సెమ్మెస్‌ ద్వారా తెలియజేస్తామని తెలిపింది.