Noida, August 28: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ, యావత్తు దేశ ప్రజానీకంలో ఉత్కంఠ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ పూర్తి సురక్షితమైనదని హామీ ఇచ్చారు.
జంట భవనాలపై సంక్షిప్త సమాచారం
నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012
రెండు జంట భవనాలు : అపెక్స్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు)
భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600
నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా
టవర్స్ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు
కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు
శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు
శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు