New Delhi, August 26: INX మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంకు సుప్రీం కోర్టులోనూ ఊరట లభించలేదు. బెయిల్‌కు అప్పీల్ చేస్తూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం పక్కకు పెట్టేసింది. సీబీఐ కస్టడీ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో గత బుధవారం రాత్రి పి.చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టుకు ముందే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మనీలాండరింగ్, అధికార దుర్వినియోగం తీవ్రమైన అభియోగాలని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్ట్ ఈ అంశంలో ఆయనకు బెయిల్ నిరాకరించింది.
ఈ నేపథ్యంలో చిదంబరం తరఫు లాయర్లు ఢిల్లీ హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ గత బుధవారం అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ విచారణకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపించింది. ఈ క్రమంలో ఆయనను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని గురువారం రోజున ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. సీబీఐ కోర్టు కూడా ఆగష్టు 26 వరకు ఆయన కస్టడీని పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
నేడు, ఆగష్టు 26న చిదంబరం బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే అప్పటికే సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేయడంతో ఆయన సుప్రీంలో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ చెల్లదంటూ సుప్రీం కోర్టు వెల్లడించింది.
అయితే అరెస్టుకు ముందే తాము ఈ పిటిషన్ దాఖలు చేశాము కాబట్టి దీనిపై విచారణ జరపాల్సిందిగా చిదంబరం తరఫు న్యాయవాది వాదించారు. అయినప్పటికీ సుప్రీం మాత్రం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇటు సీబీఐ అరెస్టును కూడా సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్ గురించి మరో న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, అది ఇంకా కోర్టులో లిస్ట్ చేయబడలేదని ధర్మాసనం వెల్లడించింది.
కాగా, నేటితో చిదంబరంపై ఉన్న సీబీఐ కస్టడీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీని పొడగించేలా అభ్యర్థించనున్నారు. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చిదంబరం అధికారుల కస్టడీలోనే ఉండనున్నారు.
సోమవారం మధ్యాహ్నం నాటికి వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం చిదంబరం కస్టడీని మరో నాలుగు రోజులు సీబీఐ ప్రత్యేక కోర్టు పొడగించింది. దీని ప్రకారం ఆగష్టు 30 వరకు చిదంబరం సీబీఐ అధికారుల కస్టడీలో ఉండనున్నారు.