New Delhi, SEP 15: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్‌ను (Rahul Naveen) కేంద్రం శుక్రవారం నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవీ కాలం ఈ నెల 15తో ముగిసిన నేపథ్యంలో రాహుల్ నవీన్‌ను ఇన్ చార్జీ డైరెక్టర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ఈడీకి పూర్తికాలం డైరెక్టర్‌ను నియమించే వరకూ రాహుల్ నవీన్.. ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. విస్త్రుత ప్రజా ప్రయోజనాల రీత్యా 46 రోజులు సంజయ్ కుమార్ మిశ్రాను కొనసాగించేందుకు అనుమతించాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు మన్నించింది. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది.
ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పొడిగిస్తూ ఇప్పటి వరకూ జారీ చేసిన రెండు నోటిఫికేషన్లు చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు ఇంతకుముందే తేల్చి చెప్పింది. ఏడాది కోసారి సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం ముగియడానికి ఒక రోజు ముందే 22 మంది సీనియర్ అధికారులను ఈడీ బదిలీ చేసింది. 2018 నవంబర్ 19 నుంచి ఈడీ డైరెక్టర్‌గా ఎస్ కే మిశ్రా కొనసాగుతున్నారు. మూడు సార్లు ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. దీన్ని సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత జూలై 27న మరోసారి పదవీ కాలం పొడిగించినప్పుడు సుప్రీంకోర్టు స్పందించింది. ఆయన పదవీ కాలాన్ని మరో 46 రోజులు మాత్రమే పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.