Jammu & Kashmir Update: మరో 15 రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించనున్నట్లు కాశ్మీర్ లోయకు చెందిన ప్రజాప్రతినిధులకు హామి ఇచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
Union Home Minister Amit Shah (Photo Credits: IANS)

New Delhi, September 03:  జమ్మూ కాశ్మీర్ కు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను మంగళవారం  నార్త్ బ్లాక్ లో కలిశారు. జమ్మూ కాశ్మీర్‌లో కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్ మరో 15 రోజుల్లో ముగుస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన కాశ్మీర్ లోయ నుండి ప్రజాప్రతినిధులు కేంద్ర హోంమంత్రిని వచ్చి కలవడం ఇదే తొలిసారి.

కాశ్మీరీ ప్రజాప్రతినిధుల బృందంలో లోయకు చెందిన 22 మంది సర్పంచ్‌లు ఉన్నారు. అయితే వీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉగ్రవాదుల నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ ధైర్యంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు.

గత నెల ఆగస్ట్ 5న, భారత పార్లమెంటు ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా తొలగింపు మరియు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది, దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజింపబడింది.

పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు అలజడులు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి నుండి, జమ్మూ కాశ్మీర్ లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఎక్కడిక్కక్కడ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. పరిస్థితి మెరుగవుతున్న కొద్దీ దశల వారీగా ఆంక్షలు సడలించుకుంటూ వస్తున్నారు. కాశ్మీర్ లోయలో 90 శాతానికి పైగా చోట్ల పగటి ఆంక్షలు లేవని సోమవారం ప్రభుత్వం తెలిపింది. పగటిపూట ఆంక్షలలో సడలింపు గత వారం నుండి 81 పోలీస్ స్టేషన్ల పరిధుల నుంచి నుండి 92 పరిధులకు పెంచినట్లు జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ చెప్పారు.

జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్లు పూర్తిగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా కాశ్మీర్ లోయలో పరిస్థితిని బట్టి దశలవారీగా సడలిస్తున్నట్లు తెలియజేశారు. లోయలో ఇప్పటికే లోయలో 26,000 ల్యాండ్‌లైన్‌లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా పనిచేస్తున్నాయని,స్కూళ్లలో కూడా మంచి హాజరు శాతం నమోదవుతుందని తెలిపారు.

అయితే కాశ్మీర్ లోయలో ఇంకా కొన్ని చోట్ల నిషేదాజ్ఞలు కొనసాగుతుండంతో అక్కడి ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు అమిత్ షాను కలిసింది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో ఆంక్షలను ఎత్తివేయబోతున్నట్లు అమిత్ షా వారికి హామీనిచ్చారు.