RIP Nirbhaya: ఎన్నాళ్లో వేచిన ఉదయం, నిర్భయ దోషులు ఖతం! నిర్భయ దోషులకు బిగిసిన ఉరితాడు, సరిగ్గా ఉదయం 5:30 నిమిషాలకు పూర్తైన మరణశిక్ష అమలు
Nirbhaya case convicts | File Image

New Delhi, March 20:  2012 నిర్భయ కేసులో (Nirbhaya Case) నలుగురు దోషులు - వినయ్ శర్మ (26), అక్షయ్ సింగ్ ఠాకూర్ (31), పవన్ గుప్తా (25), ముఖేష్ సింగ్ (32) లను భారతకాలమానం ప్రకారం ఈరోజు ఉదయం తెల్లవారుఝామున 5:30 గంటలకు దిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో (Tihar Jail) ఉరితీశారు. ఉత్తరప్రదేశ్ చెందిన తలారి పవన్, ఒక వైద్యుడు, అతి కొద్ది మంది జైలు అధికారుల నడుమ నేరస్తుల ఉరితీత (Execution) అమలు జరిగింది.

ఉదయం 4 గంటలకే వీరికి జైలు అధికారులు అల్పాహారం అందించారు, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, జైలు నెం.3లో నలుగురిని ఒకేసారి ఉరితీశారు.

అరగంట పాటు దోషులను ఉరికంభాలకు వేలాడదీశారని  నివేదికలు వెల్లడించాయి. కాగా, భారతదేశ చరిత్రలో ఇలా నలుగురిని ఒకేసారి ఉరితీయడం ఇదే తొలిసారి.

చనిపోయేముందు వరకు కూడా వారిలో ఎలాంటి ప్రవర్తన లేదు, అయితే వారి ప్రవర్తనలో తేడా కనిపించిందని కొంతమంది జైలు అధికారులు అంతకుముందు వెల్లడించారు. ఎట్టకేలకు సుదీర్ఘమైన 8 సంవత్సరాల తర్వాత 'నిర్భయ' కు, ఇంతకాలంగా న్యాయపోరాటం చేసిన వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. తన కుమార్తె 'నిర్భయ' యొక్క ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుందని నిర్భయ తల్లి ఆశాదేవీ భావోద్వేగంతో చెప్పారు.

దోషులను ఉరితీస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు తీహార్ జైలు వద్ద ప్రజలు భారీగా వచ్చి చేరారు. నిర్భయకు శ్రద్దాంజలి, రిప్ నిర్భయ, ఇదీ నిర్భయకు అసలైన రోజు అని ప్లకార్డులు ప్రదర్శించారు.

Here's the update by ANI

 

కాగా, నిర్భయ దోషులు చివరి క్షణం వరకు ఈ ఉరిశిక్ష తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఉరికి కొన్ని గంటలు ఉందనగా దిల్లీ కోర్టు, సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లు వేశారు. ఇప్పుడు అవకాశాలు ఏమి లేవని కోర్టులు వీరి పిటిషన్లను కొట్టిపారేశాయి. ఆ తర్వాత ఉరిపై స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ వాదనలు కొనసాగాయి.

అయితే కోర్ట్ మాత్రం వీరి వాదనలను తోసి పుచ్చింది.

ఉరితీతను నిలిపివేయడం కోసం దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చివరి నిమిషం వరకు పోరాడారు. దోషులను ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు పంపండి, డోక్లాంకు పంపండి, కానీ వారిని ఉరి మాత్రం తీయకండి "అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్ట్ మాత్రం ఏ మాత్రం అంగీకరించలేదు. ఒక దశలో ఉదయం వరకు ఇలాగే వాదించినా ఏం లాభం లేదని దిల్లీ హైకోర్ట్ తేల్చి చెప్పింది.

2012 డిసెంబర్ 16న దేశ రాజధాని దిల్లీలో ఒక పారామెడికల్ స్టూడెంట్ పై కదులుతున్న బస్సులో 6గురు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలిపై అమానవీయ చర్యలకు పాల్పడ్డారు, ఆ గాయాలకు నిర్భయ కొన్నిరోజులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో 6గురిలో ఒకడు మైనర్ కాగా జువైనల్ శిక్షాస్మృతుల ప్రకారం శిక్ష పడింది, మరొకడు 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురి చాప్టర్ ఈరోజు ముగిసింది.