New Delhi, AUG 10: భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ (Justice Uday Umesh Lalit) నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu). ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Chief Justice of India NV Raman) పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్ (Justice Uday Umesh Lalit).. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు.
అయితే.. జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న జన్మించారు. జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 డిసెంబర్ వరకూ బాంబే హైకోర్టులో పని చేశారు.
ఆపై ఢిల్లీలో సేవలు అందిస్తూ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనను బార్ సిఫార్సు చేయకముందు సీబీఐ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.