![](https://test1.latestly.com/wp-content/uploads/2021/03/Ramesh-Jarkiholi.jpg)
Bengaluru, JAN 22: కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka assembly elections) జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటుకు రూ.6,000 చొప్పున ప్రజలకు ఇస్తామని బీజేపీ నేత (BJP Leader) అన్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. బెలగావిలోని సులేబావి (Sulebavi) గ్రామంలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆ రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి (Ramesh Jarkiholi) మాట్లాడారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లకు పలు బహుమతులను ఆమె పంచుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ‘ఇప్పటి వరకు ఆమె సుమారు రూ.1,000 విలువైన కుక్కర్, మిక్సీ వంటి గృహోపకరణాలు ఇచ్చి ఉండవచ్చు. ఆమె మరి కొన్నింటిని కూడా ఇవ్వవచ్చు. ఇవన్నీ కలిపితే సుమారు రూ.3,000 విలువ ఉంటాయి. అయితే మీకు రూ. 6,000 ఇవ్వకపోతే మా (BJP) అభ్యర్థికి ఓటు వేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నా’ అని అన్నారు.
Karnataka: BJP leader Ramesh Jarkiholi promises money for vote
NDTV's Sreeja MS reports pic.twitter.com/2tc0Y6tdDu
— NDTV Videos (@ndtvvideos) January 22, 2023
ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, 2021లో సెక్స్ స్కాండల్ ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జార్కిహోళి వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరించింది. తమ పార్టీలో అలాంటి వాటికి తావులేదని బీజేపీ మంత్రి గోవింద్ కర్జోల్ అన్నారు. రమేష్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. అలాంటి వాటికి పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి (Ramesh Jarkiholi) వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయన ప్రకటన రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ ఆరోపించారు. ‘బీజేపీ ఎమ్మెల్యేలంతా 40 శాతం అవినీతికి పాల్పడుతూ మనుగడ సాగిస్తున్నారని విమర్శించారు. లంచాల ద్వారా కావాల్సినంత డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనూ అదే పని చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై ఈసీ దృష్టిసారించాలని ఆయన డిమాండ్ చేశారు.