Kerala Rains. (Photo Credits: ANI)

Thiruvananthapuram, October 17: కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కూట్టిక్కల్, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల నుంచి మరికొన్ని మృతదేహాలు ఆదివారం వెలిగి తీశారు. దీంతో ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21కి (Death Toll Due Heavy Rainfall and Landslides Rises to 21) చేరింది. కొట్టాయంలో 13, ఇడుక్కిలో 8 మంది మృతి చెందినట్టు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. భారత వైమానిక, సైనిక, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానికులు సహాయక చర్చలు ముమ్మరం చేశారు. కొట్టిక్కల్, కొక్కయార్ పంచాయతీల పరిధిలో డజను మందికి పైగా జాడ గల్లంతైనట్టు చెబుతున్నారు.

కాగా, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో అతలాకతులమైన ప్రాంతాల్లోని టూరిస్టు కేంద్రాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసివేయాలని, బోటింగ్ సర్వీసును కూడా సస్పెండ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేరళలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సహాయ కార్యక్రమాలతో సహా బాధితులను అన్నిరకాలా ఆదుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఓ ట్వీట్‌లో తెలిపారు.