Khammam, NOV 01: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి(Indian Student)ని కత్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే విద్యార్థి తలభాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ కత్తితో అటాక్ చేశాడు. ఇండియానాలోని వల్పరైసో సిటీలో ఉన్న ఓ జిమ్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ (Indian Student Attacked) తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వరుణ్ కండీషన్ సిరీయస్‌గా ఉందని, అతను బ్రతికే ఛాన్సు కేవలం 5 శాతమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్(Varun raj) ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆసుపత్రి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.