Kolkata, March 9: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రైల్వే కార్యాలయాలు ఉన్న భవనంలోని 17వ అంతస్తులో ఈ ప్రమాదం (Kolkata Fire Tragedy) చోటుచేసుకుంది. కోల్‌కతాలోని స్ట్రాండ్ రోడ్‌లోని కొత్త కోయిలాఘాట్ భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పది అగ్నిమాపకదళ వాహనాలు మంటలను అదుపు చేశాయి.
భవనంలోని 17వ అంతస్తులో తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్లకు చెందిన కార్యాలయాలున్నాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది మృతి (Railway Building Blaze Rises to 9) చెందారు. మృతులలో ఇద్దరు ఆర్ఫీఎఫ్ జవాన్లు, ఒక ఎస్ఐ, నలుగురు అగ్నిమాపకదళ సిబ్బంది ఉన్నారు. సమాచారం తెలియగానే సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. అగ్ని ప్రమాదం సంభవించిన ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఉన్నవారిని తక్షణం ఖాళీ చేయించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోల్‌కతాలోని 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
స్ట్రాండ్ రోడ్డులోని ఈస్ట్రన్ రైల్వే భవంతిలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు రైల్వే సిబ్బంది, ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశిస్తూ కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ఆర్డర్ జారీ చేశారు.