New Delhi, December 16: భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) పదవీకాలం మరో రెండు వారాల్లో ముగుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం ఆయన వారసుడి (successor) పేరును ప్రకటించింది. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే (Manoj Mukund Naravane) ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) గా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ (Indian Army chief) బిపిన్ రావత్ డిసెంబర్ 31న రిటైర్ కానున్నారు. అదే రోజు మనోజ్ ముకుంద్ ఆర్మీ చీఫ్ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మనోజ్ ముకుంద్‌కు మిలటరీలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. కాశ్మీర్ మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో సైనిక పోరాట సమయంలో బెటాలియన్లకు నాయకత్వం వహించారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆఫ్ పూణే మరియు డెహ్రాడూన్ యొక్క ఇండియన్ మిలిటరీ అకాడమీ యొక్క పూర్వ విద్యార్థి అయిన మనోజ్ ముకుంద్ 1980 జూన్ నెలలో భారత సైన్యంలో నియమింపబడ్డారు. రెండవ లెఫ్టినెంట్ హోదాతో చేరిన ఆయన, 2015 నవంబర్‌లో లెఫ్టినెంట్ జనరల్ హోదాకు ఎదగడంలో విజయం సాధించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో మనోజ్ ముకుంద్ కు ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్‌గా పదోన్నతి లభించింది. బిపిన్ రావత్ నేతృత్వంలో భారత సైన్యం నిర్వహించిన ఎన్నో కీలకమైన మిషన్లు విజయవంతమయ్యాయి. రావత్ సాధించిన విజయాలలో మనోజ్ ముకుంద్ పాత్ర కూడా బలమైనదిగా పరిగణిస్తారు.
ఇదిలా ఉండగా, త్వరలో రిటైర్ కాబోయే రావత్ సేవలను మరింత కాలం ఉపయోగించుకునేందుకు ఆయనను మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా నియమించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివిధ దళాలను సమన్వయపరిచే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నూతన విభాగానికి రావత్‌ను చీఫ్‌గా ప్రకటించే అవకాశం ఉందని పలు నివేదికల ద్వారా తెలుస్తుంది.