Kolkata, SEP 12: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Hospital) హాస్పిటల్‌లో ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. డాక్టర్లు చర్చలకు రాకపోవడంపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం తన పదవికి రాజీనామా (Mamata Banerjee To Resign) చేసేందుకు సిద్ధమేనని అన్నారు. గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను చర్చల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం మమతా బెనర్జీ హాజరు కావాలని, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చర్చలకు మమతా బెనర్జీ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే లైవ్ టెలికాస్ట్ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ల బృందం చర్చలకు హాజరుకాలేదు.
Here's Tweet
For people's sake, I am ready to resign; I also want justice for murdered RG Kar hospital doctor: WB CM Mamata Banerjee pic.twitter.com/ut6nINQF4F
— Press Trust of India (@PTI_News) September 12, 2024
కాగా, డాక్టర్లతో చర్చల కోసం ఎదురుచూసిన సీఎం మమతా బెనర్జీ అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసన చేస్తున్న వైద్యులను కలిసేందుకు తాను రెండు గంటల పాటు వేచి చూశానని తెలిపారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. సమావేశాన్ని రికార్డ్ చేసేందుకు పూర్తి వ్యవస్థ కలిగి ఉన్నట్లు తెలిపారు. పారదర్శకత కోసం రికార్డింగ్‌ను సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. ‘నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు. తిలోత్తమకు న్యాయం జరుగాలని నేను కోరుకుంటున్నా. సామాన్య ప్రజలు వైద్యం పొందాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. అలాగే చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు.
కాగా, కొందరు స్వార్థ ప్రయోజనాలతో నిరసనకు సూత్రధారిగా ఉన్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులతో తమ ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దీని వెనుక రాజకీయ రంగు ఉందన్నది సామాన్యులకు తెలియదని అన్నారు. రాజకీయ రంగు పులుముకున్న వ్యక్తులకు న్యాయం అవసరం లేదని, వారికి కుర్చీ మాత్రమే కావాలని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.