Raipur, June 08: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ (Congress) ట్రెండింగ్‌లో ఉండటంతో బీజేపీ కార్యకర్త ఆందోళన చెందాడు. చివరకు ఎన్డీయే మెజార్టీ సీట్లు సాధించడంతో సంబరపడిపోయాడు. కాళీ మాత గుడికి వెళ్లి వేలు నరుక్కొని అమ్మవారికి అర్పించాడు. (Man chops off his finger) ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో బీజేపీ కార్యకర్త దుర్గేష్ పాండే ఆందోళన చెందాడు. స్థానిక కాళికాదేవి ఆలయానికి వెళ్లి బీజేపీ గెలుపు కోసం ప్రార్థించాడు. కాగా, చివరకు బీజేపీ అత్యధిక సీట్లు సాధించడం, ఎన్డీయే కూటమికి మెజార్టీ స్థానాలు రావడంతో దుర్గేష్ పాండే సంతోషం పట్టలేకపోయాడు. తిరిగి కాళీ మాత ఆలయానికి వెళ్లాడు. ఎడమ చేతి వేలు నరుక్కొని అమ్మవారికి సమర్పించాడు.
ఆ తర్వాత గుడ్డకట్టి రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు దుర్గేష్ పాండేకు తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వత మెరుగైన చికిత్స కోసం అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దుర్గేష్ చేతి నుంచి రక్తస్రావం ఆపేందుకు అక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే చికిత్సలో జాప్యం వల్ల అతడు నరుక్కున్న చేతి వేలిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.