Man Open Fired Outside Jamia (Photo Credits: ANI)

New Delhi, January 30:  దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ  (Jamia Millia Islamia University) పరిధిలో ఒక వ్యక్తి చేతిలో తుపాకీతో హల్‌చల్ చేశాడు. పౌరసత్వ సవరణ చట్టానికి (Anti- CAA & NRC) వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుండగా నిరసనకారులపై దుండగుడు తుపాకీ ఎక్కుపెట్టాడు.

జై శ్రీరాం, హిందూస్థాన్ జిందాబాద్, దిల్లీ పోలీస్ జిందాబాద్.. ఏలో ఆజాదీ (Yeh Lo Azaadi/ ఇదిగో స్వాతంత్య్రం) అంటూ వారిపై కాల్పులు (Opens Fire) జరిపాడు. ఈ ఘటనలో సిఎఎను వ్యతిరేకిస్తున్న ఒక వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి, అతణ్ని వెంటనే చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అనంతర పోలీసులు దుండగున్ని అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని 31 ఏళ్ల రామభక్త్ గోపాల్ అనే వ్యక్తిగా గుర్తించారు.

Man Open Fires Near Jamia University:

గోపాల్ తుపాకీ చేతబట్టుకొని, మీలో ఎవరికి కావాలి స్వాతంత్య్రం? అంటూ బెదిరిస్తే, విద్యార్థులంతా భయంతో నిశబ్ధంగా ఉండిపోయారు. ఈ హఠాత్పరిణామంతో వారు కొంత షాక్ కు గురయ్యారు. అనంతరం ఇదిగో తీసుకోండి మీ స్వాతంత్య్రం అంటూ ఫైరింగ్ మొదలు పెట్టాడు.

కాగా, ఇంత జరుగుతున్న అక్కడే ఉన్న పోలీస్ బెటాలియన్ లోని కొంతమంది పోలీసులు, ఏదో తమాషా చూస్తున్నట్లుగా చూస్తుండటం పట్ల దిల్లీ పోలీసులపై  (Delhi Police) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే కాకుండా ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడే ముందు ఫేస్‌బుక్ ద్వారా ఘటనను లైవ్ రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవ్వగా, ఫేస్‌బుక్ ఆ వీడియోను బ్లాక్ చేసింది.

గత రెండు మూడు నెలలుగా దిల్లీలోని జామియా వర్శిటీ రగులుతూనే ఉంది. సిఎఎ నిరసనలు, వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. డిసెంబర్ నెలలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా విద్యార్థులు, స్థానికులు కలిసి చేపట్టిన (Anti-CAA Protests)  నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులు మరియు ఇతర వాహనాలకు అల్లరిమూకలు నిప్పంటించారు. ఘర్షణలు అదుపుచేసే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. క్యాంపస్ లోకి ప్రవేశించి లాఠీఛార్జ్ చేశారు. వర్శిటీ క్యాంపస్ లోకి పోలీసులు ఇష్టారీతిన లాఠీఛార్జి చేయటం పట్ల దేశవ్యాప్తంగా అనేక యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఉద్యమించారు.