Monkeypox (Pic Credit: Twitter)

Kerala, July14; దేశంలో కేరళలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. తాజాగా, వచ్చిన ఫలితాల్లో అతడికి మంకీపాక్స్ (Monkeypox in India) సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ (Veena George) తెలిపారు.

బాధితులు ఈ నెల 12న కేరళ చేరుకున్నట్టు మంత్రి తెలిపారు. త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే డబ్ల్యూహెచ్ఓ (WHO), ఐసీఎంఆర్ (ICMR) మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణికులను పరీక్షించినట్టు చెప్పారు. వైరస్ నిర్ధారణ వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేరళ ప్రభుత్వానికి మల్టీ డిసిప్లినరీ కేంద్ర బృందం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

27 దేశాలకు పాకిన మంకీ ఫాక్స్ వైరస్, ఇప్పటివరకు 780 కేసులు నమోదు, మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు, వివరాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ వైరస్ మశూచికి కారణమయ్యే వైరస్‌ల కుటుంబానికి చెందినది. ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుంది. జ్వరం, విరేచనాలు, శరీరం, ముఖంపై దద్దుర్లు వస్తాయి. అనారోగ్యం నాలుగు వారాల వరకు ఉంటుంది. గత ఏడాది జూలైలో అమెరికాలోని టెక్సాస్‌లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ‘మంకీపాక్స్’ కేసు నమోదైంది. ఇప్పటికే పలు దేశాల్లోనూ చాలా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింది. అయితే మంకీపాక్స్‌ను అత్యవసర పరిస్థితిగా ప్రకటించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి 59 దేశాల్లో వరకు 6వేల మందికిపైగా మంకీపాక్స్‌ వైరస్ సోకింది. 80శాతానికిపైగా కేసులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.