Chandigarh, May 20: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో(1988 Road Rage Case) సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు లొంగిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సిద్ధూ (Navjot Singh Sidhu) అనారోగ్య కారణాల వల్ల తాను లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంతనే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధూ..పటియాల కోర్టు (Navjot Singh Sidhu Lodged in Patiala Jail) ముందు లొంగిపోయారు.
సిద్ధూ శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమిత్ మల్హన్ సమక్షంలో హాజరయ్యారు. అనంతరం కన్విక్షన్ వారంట్‌పై అమిత్ సంతకం చేశారు. సిద్ధూను పాటియాలా కేంద్ర కారాగారానికి పంపించాలని ఆదేశించారు. మాతా కౌసల్య ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు తరలించారు. ఇదిలావుండగా, సిద్ధూ వస్తుండటంతో, ఈ జైలులో భద్రతా ఏర్పాట్లను పంజాబ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ వీ కుమార్ పరిశీలించారు.
ఈ కేసులోని వివరాల ప్రకారం, 1988 డిసెంబరు 27న పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పార్కింగ్ స్పాట్ వద్ద సిద్ధూ, ఆయన మిత్రుడు రూపిందర్ సింగ్ సంధు, గుర్నామ్ సింగ్ మధ్య ఘర్షణ జరిగింది. గుర్నామ్ సింగ్‌ను ఆయన కారు నుంచి మిగిలిన ఇద్దరూ బయటకు లాగి, కొట్టారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుర్నామ్ తలపై సిద్ధూ కొట్టినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.