New Delhi, January 7: సుమారు ఏడేళ్ల క్రితం దిల్లీలో 'నిర్భయ' పై కదులితున్న బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం మరియు హత్య (Nirbhaya Gang Rape & Murder) కేసుకు సంబంధించి నలుగురు దోషులకు పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) మంగళవారం డెత్ వారెంట్ (death warrant) జారీ చేసింది. ఆ నలుగురు దోషులను జనవరి 22న ఉదయం 7 గంటలకు దిల్లీ తీహార్ జైలులో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలు పూర్తై, ఈ కేసులో ఉరే సరైనదని తుదితీర్పు వెలువరించిన నేపథ్యంలో నిర్భయ దోషులకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉరిశిక్ష అమలు పరిచే తేదీని ఖరారు చేసింది.
నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను గత డిసెంబర్ నెలలో సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. అసలు ఈ కేసులో రివ్యూ పిటిషన్లకు అవకాశమే లేదని స్పష్టం చేసింది. మిగతా దోషుల రివ్యూ పిటిషన్లు గతంలోనే కొట్టివేయబడ్డాయి. గత నెలలో మరొక దోషి వినయ్ కుమార్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకొని అనంతరం ఉపసంహరించుకున్నాడు.
ఇదే విషయాన్ని నిర్భయ తల్లిదండ్రులు పాటియాలా కోర్టుకు వివరించారు. నిర్భయ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనూ మరియు రాష్ట్రపతి వద్ద ఎలాంటి పిటిషన్లు పెండింగ్‌లో లేవు, సుప్రీంకోర్టు కూడా వీరి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. కాబట్టి తక్షణమే వారికి డెత్ వారంటూ జారీ చేయాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
మరోవైపు, తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలి ఉన్నాయి. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయనున్నాము. కాబట్టి ఇప్పుడే డెత్ వారంట్ జారీ చేయకూడదని దోషుల తరఫు న్యాయవాది వాదించారు.
ఈ విచారణకు నిర్భయ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. దోషులకు తొందరగా మరణశిక్ష అమలుపరిచి తమ కూతురుకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి కన్నీళ్లతో అభ్యర్థించగా, నా కొడుకుపై కాస్త దయచూపండి అంటూ దోషులలో ఒకరి తల్లి కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సతీష్ అరోరా దోషులకు ఇదే నెలలో డెత్ వారెంట్ జారీచేస్తూ సంచలన తీర్పు వెలువరించారు.
కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లకు తమ బిడ్డకు న్యాయం జరిగిందని అన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నిర్భయ' ఘటన
2012వ సంవత్సరం డిసెంబర్ 16న రాత్రి, దేశ రాజధాని దిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని 'నిర్భయ' (Nirbhaya)ను కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, మానవత్వాన్నే మరిచి ఆ యువతి పట్ల అత్యంత నీచమైన చర్యలకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటనలో కొన్నిరోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నిర్భయ డిసెంబర్ 29న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురు న్యాయస్థానాల్లో దోషులుగా తేల్చబడ్డారు. ప్రస్తుతం వీరు దిల్లీ తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే వీరిలో ఒకడు బాల నేరస్థుడు కాగా, మరొకడు రామ్ సింగ్ అనే వ్యక్తి 2013లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురు వినయ్ శర్మ (Vinay Sharma), అక్షయ్ సింగ్ ఠాకూర్ (Akshay Singh Thakur), ముఖేశ్ సింగ్ మరియు పవన్ గుప్తాలు కారాగారంలో కాలం వెల్లదీస్తున్నారు.