New Delhi, March 16: నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో (Nirbhaya Case) ఉరిశిక్ష పడిన దోషుల కుటుంబ సభ్యులు (Convicts' Kin) తాము చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు (Ram Nath Kovind) లేఖ రాశారు. ఈ 'కారుణ్య మరణం' (Mercy Killing) కోరుకునే వారిలో దోషుల వృద్ధ తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు వారి పిల్లలు ఉన్నారు.
"మేము రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారిని మరియు నిర్భయ తల్లిదండ్రులను ఒక్కటే అభ్యర్థిస్తున్నాం, ఉరిశిక్ష పడిన మా వాళ్లతో పాటు మేము కూడా చనిపోయేందుకు అనుమతిని (Euthanasia) ఇవ్వండి, తద్వారా భవిష్యత్తులో మరిన్ని నిర్భయ తరహా ఘటనలు జరగకుండా ఉంటాయి. అలాగే ఒకరి మరణానికి బదులుగా నలుగురు- ఐదుగురికి మరణశిక్షలను విధించే అవసరం కోర్టులకు కూడా ఉండబోదు" అని నిర్భయ దోషుల రక్త సంబంధీకులు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా దోషులకు మరణశిక్ష తేదీని ఖరారు చేస్తూ డెత్ వారెంట్ జారీ చేసినందుకు నిరసనగా దిల్లీ పాటియాలా హౌజ్ కోర్ట్ ఎదుట ధర్నాకు దిగారు. ఒకరి మరణానికి ప్రతీకారంగా ఐదుగురికి శిక్ష విధించే ఈ న్యాయవ్యవస్థ విధానాలు, తీర్పులు రద్దు కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తమ వాళ్లు చేసింది తప్పే కావచ్చు కానీ క్షమించలేనంత పాపాలు కావని వారి కుటుంబాలు పేర్కొన్నాయి. మనదేశంలో మహామహా పాపులే క్షమించబడతారని పేర్కొన్నారు. తప్పు చేస్తే ప్రతీకారంతో శిక్షించడం న్యాయం అనిపించుకోదు, క్షమించడంలోనే నిజమైన న్యాయం ఉంటుందని వారు చెప్పుకొచ్చారు.
నిర్భయ దోషుల ఖేల్ ఖతం, మార్చి 20న ఆ నలుగురికి మరణశాసనం
2012 నిర్భయ కేసులో నలుగురు దోషులు - వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్ లను మార్చి 20న తెల్లవారుఝామున 5:30 గంటలకు దిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో ఉరి తీయనున్నారు.
ఉరిశిక్ష అమలు ఎప్పుడో జరిగిపోవాల్సింది, పాటియాలా కోర్ట్ కూడా ఇప్పటికే మూడు సార్లు డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే నేరస్థులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడంలో ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేయడం, న్యాయపరమైన చిక్కులు కల్పించుకుంటూ పోవడంతో ఉరితీత అమలు పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ నలుగురు దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు అయిపోవడం, ఈసారి ఉరి వాయిదా వేసేందుకు ఎలాంటి 'న్యాయ' పరమైన అవకాశం లేకపోవడంతో నిర్భయ తల్లిదండ్రులు లేదా దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ ఇలా వారితో 'వేదాంతాలు' , వేదసూత్రాలు వల్లించడం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.
2012 డిసెంబర్ 16న దేశ రాజధాని దిల్లీలో ఒక పారామెడికల్ స్టూడెంట్ పై కదులుతున్న బస్సులో 6గురు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలిపై అమానవీయ చర్యలకు పాల్పడ్డారు, ఆ గాయాలకు నిర్భయ కొన్నిరోజులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో 6గురిలో ఒకడు మైనర్ కాగా, మరొకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నలుగురికి ఈ నెల 20న ఉరితీయాల్సి ఉంది.