Union Finance Minister Nirmala Sitharaman on economic slowdown. (Photo Credit PTI)

ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక స్థితిగతులపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. మూలధన మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా సూపర్ రిచ్ సర్ ఛార్జి నుంచి FPIలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

తమ ప్రభుత్వం 2014 నుంచి ఆర్థిక సంస్కరణలను ఎజెండాలో అగ్రస్థానంలో ఉంచిందని నిర్మలా సీతారమన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉందని, అయినప్పటికీ అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలకంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. భారత్ వేగమైన వృద్ధి రేటును నమోదు చేస్తుందని తెలిపారు.

నిర్మలా సీతారమన్ సమావేశంలోని హైలైట్స్:

బలమైన ఆర్థికవ్యవస్థలైన అమెరికా- చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చైనా కరెన్సీ విలువ పడిపోయింది. దాని ప్రభావం ప్రపంచదేశాలపైన పడింది.

ప్రపంచ జీడీపీ 3.2% నుంచి మరింత పతనమవుతుంది. 2014 నుంచే తాము చేపడుతున్న ఆర్థిక సంస్కరణల ద్వారా భారత్ సురక్షిత స్థితిలో ఉంది.

దేశంలో GSTని మరింత సులభతరం చేస్తాము. దీనిపై సోమవారం GST అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రానున్న దసరా పండగ నుంచి ఆర్థిక భద్రతకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతాయి. MSME లను బలోపేతం చేయడమే మా లక్ష్యం.

సెక్టార్ల వారీగా నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాలు:

NBFC లు మరియు బ్యాంకులు.

1) PSBలకు రూ .70,000 కోట్లు ముందస్తు మూలధనాన్ని అందించడం.

2) బ్యాంకుల్లో పారదర్శకత పెంచడం. OTS విధానాన్ని తీసుకురావడం ద్వారా MSME మరియు రిటైల్ రుణగ్రహీతలు ప్రయోజనం చేకూరుతుంది.

3) రుణగ్రహీతలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా బ్యాంకుల రేట్లలో కోతలు.

4) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి)లో రిపీటెడ్ ప్రక్రియలను నివారించడానికి ఆధార్ ప్రామాణీకరించిన బ్యాంక్ కెవైసిని ఉపయోగించడానికి అనుమతి. అలాగే, బ్యాంకుల ద్వారా పర్యవేక్షణ.

5) స్టార్టప్‌లు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి సిబిడిటి సభ్యుని పర్యవేక్షణలో ప్రత్యేక సెల్.

ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగం.

1) గృహ నిర్మాణం, వాహనాల కొనుగోళ్లను బాగా ప్రోత్సహించేలా రుణ మద్దతు.

2) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సి) అదనపు లిక్విడిటీ సపోర్ట్. రూ .20,000 కోట్ల నుంచి రూ .30,000 కోట్లకు పెంపు.

3) లోన్ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవటానికి ఆన్‌లైన్ ట్రాకింగ్.

4) గృహ రుణాలు, వాహనం మరియు ఇతర రిటైల్ రుణాల కోసం స్వల్ప EMIలు ఉండేలా రెపో రేటును వడ్డీ రేట్లకు నిర్దేశించడం.

5) మౌలిక సదుపాయాల కోసం రుణ మొత్తాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఒక సంస్థను స్థాపించడానికి ప్రతిపాదన.