National Register of Citizens: ఎన్‌ఆర్‌సీపై కేంద్రం వెనకడుగు? జాతీయ పౌర పట్టిక సిద్ధం చేయడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటుకు తెలిపిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
People during NRC exercise in Assam (Photo Credits: IANS)

New Delhi, February 4:  జాతీయ పౌర జాబితాకు (National Register of Citizens) వ్యతిరేకంగా నిరసనల పెరుగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ (NRC) చేపట్టే అంశంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో స్పష్టం చేసింది. లోకసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా "జాతీయ స్థాయిలో భారత పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్ఐసి) ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ( Nityanand Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఆమోదం పొందిన తరువాత దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి చేపడతామని గతేడాది ఏప్రిల్ నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.  దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తామని, అందుకోసం దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ సిద్ధం చేస్తామని అక్టోబర్ లో కూడా అమిత్ షా ప్రకటించారు.  మొదట పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతాం, ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జాతీయ పౌర పట్టిక సిద్ధం చేస్తాము. ఎన్ఆర్సీని కేవలం బెంగాల్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చేపడతామని షా ఆనాడు అన్నారు. కాగా, నేడు లోకసభ సాక్షిగా హోంమంత్రిత్వ శాఖ సహయ మంత్రి నిత్యానంద్, ప్రభుత్వం ఆ దిశగా ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని పేర్కొనడంతో ఎన్ఆర్సీపై ప్రస్తుతానికి కేంద్రం వెనకడుగు వేసినట్లుగా అర్థమవుతోంది.