Amaravati, Nov 23: దేశంలో కోవిడ్ మహమ్మారి ఇంకా పోలేదు. థర్డ్ వేవ్ ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తోంది. మన దేశంలో కూడా ఇది పుంజుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో ఊపందుకుంది. ఇక కరోనావైరస్ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు బూస్టర్ డోసు (Booster Dose) అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని (No scientific evidence) భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ ( Indian medical body chief Dr Balram Bhargava ) సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్‌టీఏజీఐ) త్వరలో భేటీ అయి బూస్టర్ డోసుపై (support need for booster shot to fight Coronavirus) ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని..బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు.
బూస్టర్ డోస్ అంటే.. కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకున్నఐదారు నెలలకు వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం బాడిలో తగ్గుతుందని తెలిసినప్పుడు మూడో డోసు ఇస్తారు. దీన్నే బూస్టర్ డోసుగా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్ డోసులను సిఫారసు చేశాయి.
నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్ డోసులను అందించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇక బూస్టర్ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఇది వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు.