New Delhi, July 25: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,472 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు (Coronavirus Cases in India) చేరుకుంది. శుక్రవారం రోజు 535మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కు పెరిగింది.
అదే విధంగా గడిచిన ఒక్కరోజులో 39,972 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,05,43,138 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,08,212 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 43.31 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరం పడే అవకాశం ఉన్నదని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘కొవిడ్ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది. కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు బూస్టర్ డోస్ అవసరం కావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రెండో తరం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
అయితే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే, బూస్టర్ డోస్ పంపిణీ జరుగుతుంది’ అని ఆయన వివరించారు. పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయని, సెప్టెంబర్‌లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నదని గులేరియా తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో లేదా సెప్టెంబర్ నాటికి పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
కేరళలో గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 18,531 కరోనా కేసులు, 98 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,54,064కు, మొత్తం మరణాల సంఖ్య 15,969కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 15,507 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,99,469కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,38,124 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.