Vijay Wadettiwar (PIC@ ANI X)

Mumbai, May 05: మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విజయ్ వాడెట్టివార్ (Vijay Wadettiwar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో హీరోగా నిలిచిన పోలీస్‌ అధికారి హేమంత్ కర్కరేను కాల్చి చంపింది ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతున్న పోలీస్‌ అధికారి ఆయనపై కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష పడేలా కోర్టులో వాదించిన ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ ఈ విషయాన్ని దాచారని విమర్శించారు. అలాంటి ద్రోహి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉజ్వల్ నికమ్‌ను విజయ్ వాడెట్టివార్ దుమ్మెత్తిపోశారు. ‘నికమ్‌ బిర్యానీ ప్రస్తావన తెచ్చి కాంగ్రెస్ పరువు తీశారు. కసబ్‌కి ఎవరైనా బిర్యానీ ఇస్తారా? ఆ తర్వాత ఉజ్వల్ నికమ్ దీనిని అంగీకరించారు. కోర్టులో సాక్ష్యం చెప్పని ఈ ద్రోహి ఎలాంటి న్యాయవాది? ముంబై పోలీస్‌ అధికారి హేమంత్ కర్కరేను బలిగొన్న బుల్లెట్‌ కసబ్ తుపాకీ నుంచి కాల్పులు జరిపింది కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు విధేయుడైన ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపిన బుల్లెట్‌. ఈ నిజాన్ని కోర్టులో దాచిన ద్రోహికి బీజేపీ ఎందుకు టికెట్‌ ఇచ్చింది? ద్రోహులను బీజేపీ సమర్థిస్తున్నదా? అనే ప్రశ్న తలెత్తుతోంది’ అని అన్నారు.

 

మరోవైపు మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హసన్ ముష్రిఫ్ సోదరుడు, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్‌ఎం ముష్రిఫ్ రాసిన ‘హూ కిల్డ్ కర్కరే’ పుస్తకంలో ప్రస్తావించిన విషయాన్ని తాను చెప్పానని విజయ్ వాడెట్టివార్ తెలిపారు. హేమంత్ కర్కరేను బలిగొన్న బుల్లెట్ ఉగ్రవాది కసబ్‌ కాల్పులు జరిపిన గన్‌కు చెందిన బుల్లెట్ కాదన్న అంశంపై పూర్తి సమాచారం ఈ పుస్తకంలో ఉందన్నారు. అయితే విజయ్ వాడెట్టివార్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.