Balasore, June 04: ఒడిశా రైలు ప్రమాదం ఘటనను (Odisha Train Accident) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు మొత్తం కేసును పూర్తిస్థాయి దర్యాప్తు కోసం సీబీఐకి సిఫారసు (CBI Probe) చేస్తోందన్నారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటి వరకు ఎలాంటి పరిపాలనాపరమైన సమాచారం వచ్చినా దర్యాప్తును సీబీఐతో జరపాలని బోర్డు నిర్ణయించిందని వివరించారు. అయితే, ప్రమాదానికి మూల కారణాన్ని, దానికి బాధ్యుతులైన ‘నేరస్తులను’ గుర్తించామన్న ఆయన.. కొద్ది గంటల్లోపే సీబీఐకి సిఫారసు చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు పూరయ్యాయన్నారు. సంఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్‌హెడ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుందన్నారు.
వాస్తవానికి ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంఖ్య 288 ఉంటుందని తొలుత ఒడిశా ప్రభుత్వం చెప్పింది. అనంతరం ఆ సంఖ్యను 275కు తగ్గించింది. ఇదే సమయంలో గాయపడిన వారి సంఖ్యను 1,175 గా పేర్కొంది. మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. “బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి చేశాము” అని ఆయన అన్నారు. మూడు రైళ్లు- షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ సహా ఒక గూడ్స్ రైలు శుక్రవారం సాయంత్రం ఢీకొట్టుకున్నాయి.