New Delhi, April 27: అంతర్యుద్ధంగా కారణంగా సూడాన్‌లో (Sudan) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది. భారత వాయుసేన, నౌకా దళాలు, ఇతర విమానాల ద్వారా దశల వారీగా భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది. ఈ క్రమంలో 360 మంది భారతీయులతో సౌదీఅరేబియన్ ఎయిర్‌లైన్ విమానం జెడ్డాలోని (Jeddah) కింగ్ అబ్దుల్‌అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళనలో ఉన్న బాధితులంతా క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, సూడాన్‌లో చిక్కుకున్నవారిలో ఇప్పటివరకు 534 మంది భారత్‌కు తిరిగివచ్చారు. ఇంకా అక్కడ ఉన్నవారిని తలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
India welcomes back its own. #OperationKaveri brings 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi. pic.twitter.com/v9pBLmBQ8X
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 26, 2023
సూడాన్‌లో ఉన్న 256 మంది భారతీయులను పోర్ట్ సూడాన్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సీ-130జే మిలిటరీ రవాణా విమానాల్లో జెడ్డాకు తరలించారు. అంతకుందు ఇండియన్ నేవీ షిప్‌లో 278 మందిని యుద్ధ క్షేత్రం నుంచి క్షేమంగా తరలించారు. సూడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు. కాగా, సూడాన్‌లో సుమారు మూడు వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు.