P. Chidambaram Case: చిదంబరంకు భారీ షాక్! బెయిల్ నిరాకరణ, ఆగష్టు 26వరకు సీబీఐ కస్టడీకి అనుమతించిన ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసును పకడ్బందీగా టేకప్ చేస్తున్న సీబీఐ మరియు ఈడీ. శుక్రవారం సుప్రీం కోర్టులోనూ విచారణ.
Congress leader P Chidambaram. (Photo Credits: PTI)

New Delhi, August 22:  INX మీడియా  కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంను ఆగష్టు 26వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు ఆయన సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ నాలుగు రోజుల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు రోజుకు 30 నిమిషాల పాటు ఆయనను కలిసేందుకు   న్యాయస్థానం వీలు కల్పించింది.

INX మీడియా అవినీతి కేసును సీబీఐ, ఈడీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈ కేసు విషయంలో చిదంబరం మెడకు ఉచ్చును గట్టిగా బిగిస్తున్నాయి. ఒకవైపు గురువారం రోజున ఆయనపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, ఇంకోవైపు శుక్రవారం రోజున సుప్రీం కోర్టులో విచారణ లిస్టులోకి తీసుకొచ్చింది.

అయితే ఇది ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం లాయర్లు సుప్రీంలో వేసిన పిటిషన్. దీనికి ప్రతిగా ఈడీ తరఫున ఈనెల 27న సుప్రీం విచారించాల్సి ఉన్న పిటిషన్ కూడా రేపే విచారణకు రాబోతుంది. ఇకపై సుప్రీంకోర్టు ఇంకా ఏం తేలబోతుందో చూడాలి.

చిదంబరం అరెస్ట్, ఆ తరువాత జరిగిన పరిణామాలు. 

INX మీడియా కుంభకోణం కేసుకు సంబంధించి చిదంబరంను, సీబీఐ అధికారులు బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ గెస్ట్ హౌస్ కు తరలించారు. గెస్ట్ హౌస్ లోని లాక్- అప్ సూట్ నంబర్ 5లో ఉంచి గత రాత్రి నుంచి చిదంబరంను పలు రౌండ్లు సీబీఐ అధికారులు విచారించారు.

నేడు గురువారం రోజున ఆయనను పటిష్ఠ భద్రత నడుమ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

సీబీఐ కోర్టులో వాడి-వేడీ వాదనలు..

సీబీఐ తరఫున వాదనను వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మహతా INX మీడియా కేసు వ్యవహారానికి సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు చిదంబరంను సీబీఐకి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. చిదంబరంకు సంబంధించిన రిమాండ్ డాక్యుమెంట్లతో పాటు, ఇప్పటికే ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులను ఆయన న్యాయమూర్తికి సమర్పించారు.

ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వుల తర్వాత, తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసినా చిదంబరం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, చాలాసేపటికి బలవంతంగా ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశామని తుషార్ న్యాయమూర్తికి వివరించారు.

అనంతరం, చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తన క్లైంట్ చిదంబరాన్ని గత రాత్రే అరెస్ట్ చేసినా, విచారణ మాత్రం గురువారం ఉదయం చేపట్టారని ఆయన కోర్టుకు తెలిపారు.

INX మీడియా, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(FIPB) వ్యవహారానికి సంబంధించి గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన చిదంబరం ఒక్కరే అనుమతులు ఇవ్వలేదని. ఆ బోర్డులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారని, అందరూ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్న విషయం అని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఆ మిగిలిన ఆరుగురిని అరెస్ట్ చేయకుండా కేవలం చిదంబరంని మాత్రమే అరెస్ట్ చేయడంలో కేవలం రాజకీయ కారణాలు మాత్రమే ఉన్నాయని కపిల్ సిబల్ తెలిపారు.

చిదంబరం విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నపుడు నిందితుడిని కస్టడీలో ఉంచడం సరైనది కాదని లాయర్ కోర్టుకు గుర్తుచేశారు. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు.

కపిల్ సిబల్ అనంతరం మరో సీనియర్ లాయర్ అభిషేక్ జింఘ్వి కల్పించుకొని చిందంబరంకు మద్ధతుగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీబీఐ పిటిషన్ ను ఆయన తోసిపుచ్చారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విషయంలో గతేడాది ఏప్రిల్‌లో చిదంబరం కుమారుడు మరియు ఈ కేసులో సహ నిందితుడు అయిన కార్తీ 23 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఎదుర్కొన్నారని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు వీరు పూర్తిగా సహాకరిస్తూనే ఉన్నారు, ఎక్కడికి పారిపోవడం లేదు కాబట్టి కస్టడీ అవసరం లేదని ఆయన వాదించారు.

మరోవైపు INX మీడియా యాజమాన్యమైన షబ్నమ్ ముఖర్జీయా మరియు ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఈ కేసుకు సంబంధించి తమ వాదనను రికార్డ్ చేశారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలిసిన మాట వాస్తవమే అని వారు వివరించారు. అయితే ఇదంతా పూర్తి అవాస్తవమని చిదంబరం మరియు ఆయన కుమారుడు కార్తి వారి వాదనలను కొట్టిపారేశారు.

విచారణ పూర్తయిన తర్వాత, సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్, చిదంబరంను ఆగష్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు.