New Delhi, Mar 23: రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రహితలకు ఈ అవార్డులను అందజేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎమ్ కృష్ణ, పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా, నేపథ్య గాయకుడు సుమన్ కళ్యాణ్‌పూర్, ఆధ్యాత్మిక వేత్త కమలేశ్ డి పటేల్ మొదలైనవారు ఈ పురస్కారాలు స్వీకరించినవారిలో ఉన్నారు. మొత్తం 54 మందికి బుధవారం పద్మ పురస్కారాలు (Padma Awards 2023 Winners) అందించారు. మిగతావారికి మరొక కార్యక్రమంలో అందించనున్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న జీవశాస్త్రవేత్త మోడడుగు విజయ్ గుప్తా
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం), డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ రావు (సామాజిక సేవ), ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య) పద్మశ్రీలు స్వీకరించారు.
వృద్ధాప్యం కారణంగా నడవడానికి ఇబ్బంది పడిన సుమన్ కళ్యాణ్‌పూర్‌కు పద్మ భూషణ్ పురస్కారం అందించడానికి రాష్ట్రపతి ముర్ము ముందుకు కదలి వచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పురస్కారాల ప్రదానోత్సవానికి విచ్చేశారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(మరణానంతరం)కు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన సతీమణి అందుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్‌లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్‌షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారం రాత్రి విందు దిల్లీలో ఇచ్చారు.