Chennai, SEP 29: బీజేపీతో తెగదెంపులు చేసుకుంటూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ఏఐఏడీఎంకే ప్రకటించగా పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (Panneerselvam) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ (BJP) ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని ఏఐఏడీంఎకే (AIADMK) కాషాయ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఓపీఎస్ స్పందిస్తూ పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఏఐఏడీఎంకే అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని అన్నారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని చెప్పారు.
కాగా బీజేపీతో సంబంధాలను తెంచుకుంటామని, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కూటమితో ముందుకెళతామని ఏఐఏడీఎంకే ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని, తాము తిరిగి ఎన్డీయే గూటికి చేరేది లేదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నామలైని తొలగించాలని తాము బీజేపీ నాయకత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు.